Monday, January 6, 2020

ముక్కోటి ఏకాదశి - ముకుళిత హస్తాలు


బ్రహ్మ కడిగిన పాదము


కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నార శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం

ఏడుకొండల వాడా వేంకట రమణా నీకు మా మేలుకొలుపు వినబడుతున్నదా  స్వామీ ? రాత్రి ఒకటో జాముకి పవళింపు సేవలో 'జో అచ్యుతానంద  జో జో ముకుందా ' అంటూ అన్నమయ్య లాలి పాట పాడి నిద్ర పుచ్చామో  లేదో  మళ్ళి  మూడవ జాము కాగానే మేలుకొమ్మంటున్నాము.
అమ్మ అలిమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ల  గలిగావో లేదో, నీవేమో కొండపైన నీ దేవేరి దిగువన. మా మొరలు వింటూ, అర్థరాత్రి దాటాక గానీ  తీరిక దొరకని నీకు , అరవిందనేత్రి అయిన  అమ్మవారి అలసట ,అలక తీర్చి మేను వాల్చే టప్పటికి  ఎంత పొద్దయ్యిందో కదా! అలా సేద తీరావో లేదో ఇలా సుప్రభాతాలు పాడి మేము లేపేస్తాము .

అయినా నీవెంత దయామయుడవయ్యా! ఏమాత్రము విసుగు లేకుండా లేచి వరద హస్తం తో మమ్మాదుకుని మాకష్టాలు గట్టెక్కిస్తావు. లక్ష్మీ నాధుడివైన  నీకు మా ముడుపులు ఏపాటి ?
ఆ నెపం తో మా చిత్తశుద్ధిని పరీక్షించి , మా పాపాలను  ప్రక్షాళన చేసుకునే అవకాశము కలిగిస్తున్నావుకదా ఆపద మొక్కులవాడా !

అన్నట్టు ఈరోజు వైకుంఠ ఏకాదశి అని, నీవు యోగనిద్ర నుండీ  మేలుకొని ముక్కోటి దేవతలకు దర్శనమిస్తావని అంటున్నారు.  మరి ఈ భూమి పైనున్న జీవుల మాటేమి గోవిందా ?

ఆ క్షీర సాగరంలో ఆది శేషుడు నీకు మెత్తని పానుపు వేసాడు, ఆదిలక్ష్మి అవనత శిరస్కయై నీ పాదములు ఒత్తు తున్నది ,నీవు ఒక పక్కకు ఒరిగి నీ ఉదరమున ఉన్న ఈ బ్రహ్మాన్డము కదలకుండా,  బ్రహ్మదేవుని సృష్టికి  ఆటంకము కలుగకుండా యెంత నేర్పుగా నిద్రిస్తున్నావయ్యా ?

మత్స్యరూపాన నీటిలో ఈదాడి, జీవుడిని ఒడ్డుకు చేర్చి అలసి నావు కాబట్టి  నాగేంద్రుని ఒడిలో నిద్రించుట సబబే.

శ్రీ కూర్మమై మంధర పర్వతాన్ని మోసావు నీకు నిక్కముగా విశ్రాంతి అవసరమే .

ఆది వరాహమూర్తివై కోరల పై భూమిని నిలిపావు, ఆ భూమాతను ఇక ఆది శేషుడు మోస్తాడు అని  ఒకింత విరామం తప్పక తీసుకోవలసినదే

నారసింహుడిగా ఆవిర్భవించి  అసురుని నఖములతో చీల్చి శాంతించావు , వాటి పదును సుదర్శన చక్రానికి చేర్చి  సేద తీరాలనుకున్నావు న్యాయమే.

వామనుడివై మూడు లోకాలు కొలిచి  నిలిచినా నీ పాదాలు శ్రమ తెలియకుండా శ్రీ లక్షి ఆప్యాయంగా ఒత్తుతూ ఉందని మైమరచి నిదుర పోవడం సహజమేలే.

రామచంద్రుడిగా ధర్మ సంరక్షణ చేసి, సతీ సుతుల బాసి,  వ్యాకులము చెందిన మనస్సును శాంతింప చేయడానికి  కాసింత కనులు మూసుకున్నవేమో మరి.

జగద్గురువుగా జగతికి బోధ చేసి  మేము ఆ భగవద్గీతను వల్లే వేస్తున్నామా లేదా అని  అర్ధ నిమీలిత  నేత్రాలతో అన్నీ  అవలోకిస్తున్నావో మరి.

మాకు మాత్రం నీ కారుణ్య ద్రుష్టి కలకాలం కావాలి. మరిక యోగనిద్ర చాలించు. కలియుగమున కొంగుబంగారమై ఏడుకొండలపై వెలిసావు. యుగాది నుండీ  యుగాంతము వరకు నిలిచి ఉంటావు కదూ?

నీవు సృష్టించిన ప్రతి జీవి నీలో ఐక్యమవ్వాలని తహ తహ లాడుతున్నాయి.
మా ఏడు జన్మల పాపాలు హరించి పోగా ఏడు ద్వారాలు తెరిచి ఏకాదశి నాడు వైకుంఠ పురవాసా 
నీ దర్శనమీవయ్యా .  మా ఉపవాస దీక్షను నీవు ఉపేక్షించకు స్వామి, మా తనువును తరింప చేసి  మనసును ప్రక్షాళన గావించి నీ  సమ్మోహన రూపాన్ని
 మాకు చూపించవయ్యా .
కౌసల్యా సుప్రజా రామ  ఇక లేవయ్యా






No comments:

Post a Comment