Thursday, December 12, 2019

అభిమాన రచయితకు అశ్రునివాళి

సాయంకాలమయ్యింది
అవును ప్రతిరోజులాగే  ఈరోజూ  సాయంకాలమయ్యింది.  కానీ మదిలో తెలియని వెలితిగా వుంది.

నిజమే సాయంకాలమయ్యింది వేయి కిరణాలతో వెలిగిన సూర్యుడు  నిష్క్రమించాడు.
వేయిపడగలకు దీటైన రచనలు చేసిన  గొల్లపూడి మారుతీరావు విశ్రమించాడు.
వ్యక్తిగతంగా కలవక పోయినా ఆయన రచనలు చదివి అభిమానిగా మారాను.  మనసుకు హత్తుకునే భావ వ్యక్తీకరణ, సులభమైన  సుపరిచితమైన మాటలు పొదిగిన రాతలు, నన్నేకాదు లక్షలాది మంది  అభిమానులను ఆయనకు సంపాదించి పెట్టింది.

సంస్కారవంతమైన సంభాషణలంటే  ఎలా వుంటాయో, సమర్ధుడైన వ్యక్తి  సినిమా కథ రాస్తే  నిజ జీవితాలకు ఎలా దర్పణం పడుతుందో  ఆయన సంభాషణలు రాసిన 'ఆత్మగౌరవం', కథ సమకూర్చిన 'డాక్టరు చక్రవర్తి ' చిత్రాలను చూస్తే  తెలిసి పోతుంది.

నిజాన్ని నిక్కచ్చిగా చెబుతూ అవసరమైతే  చురకలు అంటించే వాక్యాలు చేర్చి సంపాదకీయాలు, వ్యాసాలూ రాయగల సత్తా శ్రీ మారుతి రావుగారికి ఉందంటే  సత్యదూరం కాదు.  .

తన రచనలలో  వాడిన మాటలు  తరాలు మారినా అర్థం మారనివి. ఉదాహరణకి సాయంకాలం అనే నవలలో దేశం వదిలి పోతున్న మనవడు " ఎందుకు నీకు దిగులు" అన్న మనవడికి తన మనసులో ని అలజడి  అర్థం కాలేదని తెలుసుకొని  "నా గుబులు నీ గుండె దాకా  ప్రయాణించాలంటే  ఇంకా కొంత కాలం పడుతుంది " అంటుంది.  అది ఎన్నో ఏళ్ల  క్రితం రాసిన వాక్యం.  ఈనాడైనా కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళుతూ  ఎందుకు దిగులు మీకంటే  ప్రతీ తల్లి తండ్రుల మనసులో సుడి  తిరిగే భావన ఇదే కదా!

ఆయన రచించిన నాటకాలు నేను  ఇంకా చదవలేదు కానీ , ఎంత సామాజిక స్పృహతో  యెంత ఉన్నత విలువలతో రాసి వుంటారో  ఊహించగలను. త్వరలోనే చద డానికి ప్రయత్నిస్తాను .

జీవితం మిగిల్చిన చేదు అనుభవాలన్నీ అంతర్లీనం చేసుకుంటూ, సమాజమనే  తోటలోని లోపాలనే కలుపుమొక్కల్ని  తన రాతల నాగలి తో  దున్ని  ఏరిపారవేయ  ప్రయత్నించిన నిత్య కృషీవలుడు  శ్రీ మారుతి రావుగారు.

బాధల సంకెళ్లు తెంచుకొని, భావాల లావాలు ఆర్పీ వేసి, కాగడాల్లాంటి తన రచనలని మనకు కానుకగా  ఇచ్చి,కానరాని లోకానికి తరలి పోయాడు కానీ కలకాలం మన మనసులలో నిలిచి పోతాడు. 

రచయిత , విమర్శకుడు ,వక్త, నాటక రచయిత,నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి  శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి  గురించి  నా మనసుకు తట్టి ఆయనకు గుడికట్టిన మాటలు.

రాశా 

















No comments:

Post a Comment